*కార్తీకమాస విశిష్టత*
నకార్తీక సమోమాసః- న దేవః కేశవాత్పరమ్
నచవేద సమం శాస్త్రం- న తీర్థం గంగాయాసమమ్
కార్తీక మాసం ద్వాదశ మాసాల్లో ఒకటయినా ఈ కాలంలో వచ్చే తిథుల వైశిష్ట్యం, ఉత్సవాల వైభవం.. ఇతర మాసాలకు లేని ప్రశస్తిని ఈ మాసానికి కలిగిస్తున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఏ దిక్కుకు తిరిగి నమస్కరించినా అది శివకేశవులకే చేరుతుంది. పంచ మహాపాతకాలను భస్మం చేసి పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మనసుకు మెరుగులుదిద్దే పవిత్రమాసం కార్తీకం.
కార్తీక స్నానం మహాపుణ్యప్రదం. ప్రతిరోజూ కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తెల్లవారుజామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివ ప్రీతికరం. చన్నీటి స్నానం ఆచరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమై చక్కటి ఆకలి కలిగిస్తుంది.
ఈ మాసంలో పురాణ శ్రవణం, దానధర్మాచరణ వల్ల విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.
శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఏక భుక్తంగా నక్త భోజనం ఒనరుస్తారు. ఇలా ఉండలేనివారు ఛాయానక్తంగా ఉంటారు. సాయం సమయంలో భోజనం చేస్తారు. మాసం మొత్తం నక్తం ఉండలేనివారు కార్తీక సోమవారం, పూర్ణిమ తిథినాడు నక్తములు ఉండవచ్చు.
సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈ వారం నాడు ఉపవాసం చంద్రమౌళికి ప్రీతికరం. కార్తీక సోమవారం ఉపవాసం చేస్తూ, పంచామృతాలత రుద్రాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.
ఈ మాసంలో సాయం సమయాన శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేసినవారు ధన్యులవుతారు.
దీపదానం విశేష ఫలాన్నిస్తుంది. పలు జాతుల చెట్లతో ఉన్న తోటలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ఉంచి హరిచందన పుష్పాలతో పూజ చేసి ఆ తోటలో భుజించాలి.
కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించేవారింట కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసీదళాలతో, జాజి పూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. మారేడు దళాలతో లక్ష బిల్వార్చన పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తినిస్తుంది.
తులసికోట ముందు గోమయంతో అలికి శంఖం- పద్మం- స్వస్తికం మొదలైన ముగ్గులు పెట్టిన సీ్త్ర విష్ణుప్రియ అవుతుంది.