యుద్ధభూమిలో గరుత్మంతుడిపై శ్రీహరి సహితంగా నిలచిన సత్యభామ ఒక్క సారి వీరావేశం తో యుద్ధానికి పూనుకున్నది. “ వేణిమ్ జోల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ శ్రేణిన్ దాల్చి ‘ వడి వడిగా వాలు జాడ వేసుకున్నది. చీరముడి బిగించింది. భూషణాలను సారి చేసుకున్నది. పైట బిగించింది. ముఖ చంద్రుడు కాంతు లీనుతుండగా తన కాంతుడైన శ్రీ హరి ముందు నిలిచిందట ఆ లేడి కన్నుల వన్నెలాడి. శ్రీ హరి సత్య సంరంభం చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.
“ లేమా దనుజుల గెలువగ
లేమా నీ వేల కడగి లేచితి విటు రా
లేమా ను మానవేనిన్
లేమా విల్లంది కొనుము లీలన్ కేలన్ ´
“ లేమా ! రాక్షసులను గెలువగా లేమా! నీవేందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు ఇలా రా! యుద్ధ ప్రయత్నం మాను ! మాన దలచుకోకపోతే విలాసంగా ఇదిగో ఈ విల్లు అందుకో ! “అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
హరిణాక్షి కి హరి ఇచ్చెను
సుర నికరోల్లాసనమును శూర కఠోరా
సుర సైన్య త్రాసనమును
బల గర్వ నిరాసనమును బాణాసనమున్
సత్యభామ హరినుండి విల్లు అందుకొని గొప్ప తేజస్సుని పొందింది. ధనుష్టంకారం చేసింది.
“ సౌవర్ణ కంకణ ఝుణ ఝుణ నినదంబు శింజినీ రవంబు తో జెలిమి సేయ
దాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండ మండల రుచి గప్పి కొనగ
ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణ జాల ప్ర భాపటలి నడప
శరఘాత ఘమ ఘమ శబ్దంబు పరిపంధి సైనిక కల కల స్వనంబు నుడుప
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు , కలసి భామిని యయ్యెనో కాక యనగ
నిషువు దొడగుట దివుచుట యెయు టెల్ల నెరుగ రాకుండనాని సేసె నిందు వదన “
బంగారు కంకణాల ఝుణ ఝుణ ధ్వనులు వింటి నారి తో కలిసి పోగా , చెవి కమ్మలకు పొదిగిన మణుల ధగ ధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా , అందమైన క్రీగంటి చూపుల ధళ ధళ కాంతులు బాణాల కాంతులని కప్పివేయగా , శరము లను ప్రయోగించుట వలన కలిగిన ఘమ ఘమ శబ్దం శత్రు సైన్యాల కల కల ధ్వనులను అణిచి వేయగా సత్యభామ యుద్ధం చేస్తున్నది. వీరం శృంగారం భయం రౌద్రం విస్మయం అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం లాగడం ప్రయోగించడం కూడా గుర్తించ లేనంత వేగం గా యుద్ధం చేయ సాగింది.
ఓర కంట హరి ని చూస్తూ, శృంగారం కురిపిస్తూ, తన యుద్ధకౌశలాన్నిచూపుతున్నది మరో కంట వీర రసాన్ని కురిపిస్తున్నది. ఏక కాలం లో రెండు కురిపిస్తున్నది.
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్, రోష రాగోదయా
విరాట భ్రూకుటి మందహాసముతో వీరంబు శృంగారమున్
జరగన్, కన్నుల కెంపు సొంపు బరగం జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలా గతిన్.
ఏక కాలం లో రెండు రసాలను రెండు కళ్ళతో సత్యభామ ప్రదర్శిస్తున్నది. ఓరకంట నాధుడి పై మందహాస శృంగార విలాస దృక్కులతో వీక్షిస్తూ పరవశింప చేస్తున్నది. తన పరాక్రమాన్ని వయ్యారంగా హరికి చూపి హరి ని సమ్మోహితుడుని చేస్తున్నది. మరో కంట రోషముతో కెంపుల కన్నులతో వీర రసావిష్కరణం చేస్తున్నది.