దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.
లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.
ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.
మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.
యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.
ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం.
`లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది.
విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.
శివలింగం యొక్క నిజమైన అంతరార్దం :
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"లింగాభిషేకములో పరమార్ధం :
పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.ఓం నమో పరమాత్మయే నమః